ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో నేడు రాజస్థాన్ రాయల్స్.. లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడనుంది. రాజస్థాన్ జట్టు ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైతే ప్లేఆఫ్స్ రేసు దాదాపుగా ముగిసినట్టే.
రాజస్థాన్‌కు ఇది హోమ్ మ్యాచ్ అయినా… గత రికార్డుల్ని చూస్తే పరిస్థితి అంతగా అనుకూలంగా లేదు. ఈ సీజన్‌లో ఇక్కడ ఆడిన ఏకైక మ్యాచ్‌లో రాయల్స్ ఓటమి పాలయ్యింది. ఆర్సీబీ 175 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిచింది. జైపూర్ పిచ్ బ్యాటింగ్‌కు అలాగే బౌలింగ్‌కు కొంత మేర అనుకూలంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఇది స్లో పిచ్ కావడంతో భారీ స్కోర్లు సాధించడంలో ఆటగాళ్లకు కాస్త ఇబ్బంది ఉంటుంది. ప్రారంభ ఓవర్లలో బంతి బ్యాట్‌పైకి బాగా వస్తుండగా, తర్వాత మాత్రం పిచ్ నెమ్మదిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టాస్ కీలకం కానుంది. మంచు ప్రభావం ఉంటే, టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశముంది.
రాజస్థాన్ జట్టును చూస్తే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తమ పాత్రను బలంగా పోషించాలి. కెప్టెన్ సంజూ శాంసన్‌తో పాటు యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్ వంటి ఆటగాళ్లపై అంచనాలు ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో సందీప్ శర్మ ఈ స్లో పిచ్‌ను మెరుగుగా ఉపయోగించగలడన్న నమ్మకం ఉంది.
లక్నో జట్టులో నికోలస్ పూరన్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, ఐడెన్ మార్‌క్రమ్ లాంటి బ్యాట్స్‌మెన్ ఒక్కసారి సెటిల్ అయితే వేగంగా మ్యాచ్ మలుపు తిప్పగలరు. బౌలింగ్‌లో దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్ లాంటి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే… రెండు జట్లూ ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు తలపడతాయి కానీ… రాజస్థాన్‌కు మాత్రం ఇది “చివరి అవకాశంగా” మారే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గెలిస్తే వారి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.