గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం(Liquor Scam) కేసులో రాజ్ కసిరెడ్డిని(Raj Kasireddy) కీలక నిందితుడిగా సిట్ అధికారులు భావిస్తున్న సంగతి తెలిసిందే. సిట్ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి అని ఆరోపించారు. తాజాగా విజయసాయి రెడ్డి ఆరోపణలపై రాజ్ ఓ ఆడియో విడుదల చేశారు. కొంతకాలంగా తనపై అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపారు. తాను లేనప్పుడు అధికారులు ఇంటికి, ఆఫీసుకు వచ్చి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ఇవాళ నోటీసులు ఇచ్చి రేపు విచారణకు రమ్మన్నారని.. ఈ నోటీసులపై న్యాయవాదిని సంప్రదించగా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పడంతో న్యాయస్థానాలను ఆశ్రయించానని వివరించారు.
నిర్ణీత సమయం ఇచ్చి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. అలాగే న్యాయరక్షణ కోసం సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశానని పేర్కొన్నారు. మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. న్యాయపోరాటం పూర్తి అయిన తర్వాత తనపై విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై తర్వలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని.. సాయిరెడ్డి చరిత్ర బయటపెడతానని అని రాజ్ కసిరెడ్డి ఆడియోలో పేర్కొన్నారు.