కేజ్రీవాల్ కు ప్రధాని కావాలన్న కోరిక తీరే అవకాశం ఇప్పట్లో కనిపించే ఛాన్సే లేదని తెగేసి చెబుతున్నారు రాజకీయ పండితులు. తనతోపాటు 8 మంది ముఖ్యమంత్రులతో ఈరోజు కీలక భేటీ నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బొక్క బోర్లా పడ్డారు. ఫిబ్రవరి 5న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ను ఢిల్లీకి రమ్మని ఆహ్వానాలు పంపారు కేజ్రీవాల్. 2024 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా, మూడవ కూటమిగా జట్టు కట్టేందుకు ఆయన తహతహలాడుతూ ఈ చొరవ తీసుకున్నారు. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర మూడవ కూటమిగా జట్టు కట్టేందుకు ఆయన ప్రయత్నిస్తూ ఇలా సీఎంలకు లేఖ సంధించారు.
ప్రోగ్రెస్సివ్ గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ లేదా జీ-8 పేరుతో ఆయన ఈ గ్రూపును ప్రారంభించాలని కలలు కన్నారు. అయితే ఈ లేఖ అందుకున్న వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉన్నట్టు అయితే అనారోగ్య సాకును చూపి ఆయన ఈ భేటీకి డుమ్మా కొట్టినట్టు సమాచారం. అయితే జీ-8 అనే ఈ విషయంపై ఇటు కేజ్రీవాల్ కానీ ఇతర సీఎంలు కానీ అధికారికంగా నోరు విప్పటం లేదు కానీ బెంగాల్ ప్రభుత్వం అనధికారికంగా మొత్తం విషయాన్ని ధృవీకరించింది. అయితే బిహార్ సీఎం నితీష్ కుమార్, దీదీ ..ఇలా ఎవరూ కూడా తాము ప్రధాని కావాలనుకుంటున్నట్టు బాహాటంగా కుండబద్ధలు కొట్టినట్టు చెప్పకుండానే కేవలం జాతీయ రాజకీయాలను బాగుపరచేందుకే తాము బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి కోసం సర్వం ఒడ్డుతున్నట్టు, తమకు ప్రధాని పదవిపై ఆశలేదని చెప్పుకుంటున్నారు. ఈనేపథ్యంలో కేజ్రీవాల్ చేస్తున్న ప్రయత్నాలు ఆదిలోనే విఫలం కావటం విశేషం.