ఐపీఎల్ 2025లో ఢిల్లీపై గుజరాత్ టైటాన్స్ సంచలన విజయం నమోదు చేసింది. భారీ టార్గెట్‌ను ఛేజ్ చేయడంలో జాస్ బట్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ఐపీఎల్ పాయింట్స్ పట్టికలో గుజరాత్ టాప్ కి చేరింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తూ 8 వికెట్లకు 203 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ దూకుడుగా ఆడడంతో టీమ్ భారీ స్కోర్ నమోదు చేయగలిగింది.
ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (18) కరుణ్ నాయర్ (31) తొలి వికెట్‌కు చక్కటి ఆరంభం ఇచ్చారు. వారిద్దరు వెనుదిరిగిన తర్వాత కేఎల్ రాహుల్ (28), అక్షర్ పటేల్ (39), ట్రిస్టన్ స్టబ్స్ (31) పరుగుల వేగాన్ని కొనసాగించారు. చివర్లో అశుతోష్ శర్మ 19 బంతుల్లో 37 పరుగులతో రాణించాడు. ఒక సిక్స్, ఒక ఫోర్‌తో రాహుల్ తెవాటియా ఇన్నింగ్స్‌ను ముగించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీసి ఢిల్లీని కట్టడి చేశాడు. అతనితో పాటు సిరాజ్, ఇషాంత్ శర్మ, అర్షద్ ఖాన్, సాయి కిషోర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభం అంతగా కలిసి రాలేదు. ఓపెనర్ శుభమన్ గిల్ కేవలం 7 పరుగులకే వెనుదిరిగాడు. కానీ మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (36)తో జాస్ బట్లర్ చక్కటి భాగస్వామ్యం నమోదు చేశాడు. సుదర్శన్ ఔటైన తర్వాత షర్ఫేన్ రూతర్ఫర్డ్ (43) మద్దతుగా నిలవడంతో గేమ్ గుజరాత్ వైపు తిరిగింది.
ఇక బట్లర్‌నే అద్భుతంగా ఆడటంతో మ్యాచ్ పై ఢిల్లీ ఆశలు వదులుకుంది. అతను 54 బంతుల్లో 97 పరుగులు చేస్తూ మ్యాచును ఒంటి చేత్తో మార్చేశాడు. బౌండరీలతో విరుచుకుపడ్డ బట్లర్ నాలుగు సిక్సులు, పదకొండు ఫోర్లు బాదాడు. చివరికి గుజరాత్ టార్గెట్‌ను సునాయాసంగా ఛేజ్ చేసి గ్రాండ్ విక్టరీతో టైటిల్ రేసులో ముందంజ వేసింది. ఢిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసారు. కానీ వారి ప్రయత్నాలు గుజరాత్ దూకుడును ఆపలేకపోయాయి.