ఐపీఎల్ 2025 సీజన్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు విజయ కేతనం ఎగురవేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠను కొనసాగించింది. లక్నో బౌలర్ ఆవేష్ ఖాన్ చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి విజయం లక్నో ఖాతాలో వేశాడు. ఆ ఓవర్‌లో కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక కీలక వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. మార్క్రమ్ 45 బంతుల్లో 66 పరుగులతో మెరిశాడు. ఆయుష్ బదోని కూడా 34 బంతుల్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మధురమైన పార్టనర్‌షిప్‌లతో మంచి స్కోరు అందించారు.
లక్ష్య ఛేదనలో రాజస్థాన్ జట్టు శుభారంభం చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 52 బంతుల్లో 74 పరుగులతో చెలరేగాడు. అతనికి తోడుగా రియాన్ పరాగ్ 39 పరుగులు, వైభవ్ సూర్యవంశీ 34 పరుగులతో ప్రయత్నించారు. కానీ మ్యాచ్ చివర్లో వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక తడబడ్డారు. ముఖ్యంగా ఆవేష్ ఖాన్ వేసిన చివరి ఓవర్ రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ పరాజయంతో రాజస్థాన్ రాయల్స్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టుకు ఇది ఆరో ఓటమి. పాయింట్ల పట్టికలో ఇప్పుడు రాజస్థాన్ ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ ఎనిమిది మ్యాచులు.. ఐదు విజయాలతో నాలుగో స్థానానికి చేరింది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ఈ ఓటమిని జీర్ణించుకోవటం కష్టమన్నాడు. ఎక్కడ తప్పు చేశామో చెప్పలేకపోతున్నాను. 18-19 ఓవర్ల వరకూ తాము బాగానే పోరాడామని.. 19వ ఓవర్‌లోనే మ్యాచ్‌ను ముగించాల్సి ఉందని తెలిపాడు. ఇక ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని.. సందీప్ శర్మపై మాకు నమ్మకం ఉంది కానీ ఈరోజు అతనికి అసలేమీ కలిసి రాలేదన్నాడు. సమద్ అద్భుతంగా ఆడాడు. పిచ్ కూడా బాగానే ఉందని.. కానీ తమకు లక్ కలిసి రాలేదన్నాడు.