Monday, April 21, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) నేడు 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ(PM Modi) ట్విట్టర్ వేదికగా బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మిత్రుడు, ఏపీ సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. భవిష్యత్‌ రంగాలపై దృష్టి సారించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’ అని పేర్కొన్నారు.

- Advertisement -

దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, ప్రజాసేవలో సుదీర్ఘ కాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ట్వీట్ చేశారు.

చంద్రబాబు జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఏపీ అభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన చంద్రబాబు గారికి సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.’’ అని పవన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇక మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “హ్యాపీ బ‌ర్త్ డే నారా చంద్ర‌బాబు నాయుడు గారూ! మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “దార్శనికత, కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న అరుదైన నాయకులు మీరు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని రాసుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News