ఐపీఎల్ చరిత్రలో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆడిన తొలి బంతికే సిక్స్ బాదడంతో పాటు కీలక ఇన్నింగ్స్ ఆడటంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా వైభవ్ ఆటను గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(sundar pichai) కొనియాడారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎనిమిదో తరగతి కుర్రాడి ఆటను చూసేందుకే తాను నిద్ర లేచానని.. వైభవ్ అరంగేట్రం అదిరిపోయిందంటూ పోస్ట్ పెట్టారు.
ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వైభవ్.. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు కేవలం 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది.