మీరు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారా? దాన్నుంచి బయటపడే మార్గం ఏంటో వెంటనే చూసుకోండి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే… మానసిక ఒత్తిడి పెరిగితే క్యాన్సర్ ముప్పు ఎక్కువవుతుందట. ఆ విషయాన్ని శాస్త్రవేత్తలు తాజాగా తమ పరిశోధనల్లో వెల్లడించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే గ్రీకు వైద్యుడు హిపోక్రటిస్ లాంటి వాళ్లు కూడా మానసిక కుంగుబాటు వల్ల శరీరంలో బ్లాక్ బైల్ (ఒకరకమైన కణితి) ఏర్పడుతుందని సూత్రీకరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ అంశంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంతమందికి క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉండే టైప్-సి పర్సనాలిటీ ఉంటుందని తాజాగా కొందరు పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడి, ఇతర మానసిక కారణాల వల్ల క్యాన్సర్ మనిషి శరీరంలో వేగంగా విస్తరిస్తుందని చెబుతున్నారు. కొన్ని లక్షల మందిపై నిర్వహించిన వందలకొద్దీ పరిశోధనల్ల మానసిక కుంగుబాటు, సామాజిక-ఆర్థిక స్థితిగతులు, ఇతర మానసిక ఒత్తిడుల వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని తేలింది. అప్పటికే ఆ వ్యాధి ఉన్నవారికైతే ఈ కారణాల వల్ల మరణం మరింత చేరువయ్యే ప్రమాదం ఉంటుంది.
జంతువులపై పరిశోధనలు
తాజాగా ఇదే అంశంపై కొందరు శాస్త్రవేత్తలు జంతువుల మీద పరిశోధనలు చేశారు. వీటి ప్రకారం చూస్తే.. జంతువుల్లో కూడా ఒత్తిడి వల్ల క్యాన్సర్ కణితులు వేగంగా వృద్ధి చెందుతున్నట్లు తేలిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన సైకాలజిస్ట్ జూలియన్ బోవర్ తెలిపారు. 2023లో ఆమే మెదడుకు, మన శరీరంలోని రోగనిరోధక శక్తికి మధ్య సంబంధంపై యాన్యువల్ రివ్యూ ఆఫ్ క్లినికల్ సైకాలజీ అనే పత్రికలో ఒక కథనం రాశారు. జంతువుల్లో అయినా, మనుషుల్లోనైనా మెదడులో ఒత్తిడికి కారణమయ్యే రసాయన సిగ్నళ్లను అడ్డుకోగలిగితే.. క్యాన్సర్ చికిత్స ఫలితాలు బాగుంటాయని ఆమె చెప్పారు.
ప్రధానమైన కారణాలు, ఒత్తిడి రకాలు
* ఉద్యోగాల్లో ఒత్తిడి
* శస్త్రచికిత్స చేయించుకోవాలనే ఒత్తిడి
* సామాజికంగా ఒంటరితనం
* సామాజిక ఆందోళన
* ఆర్థిక ఇబ్బందులు
* హింసకు గురికావడం
* క్యాన్సర్ ఉందన్న ఆందోళన
అలా మొదలైంది..
అసలు ఒత్తిడికి, క్యాన్సర్‌కు సంబంధం ఉందన్న విషయం అనుకోకుండా వేరే పరిశోధనతో బయటపడింది. ఒత్తిడివల్ల మనిషి శరీరం హెచ్ఐవీకి ఎలా ప్రభావితం అవుతుందోనని జీనోమిక్స్ పరిశోధకుడు స్టీవ్ కోల్ బృందం పరిశోధనలు చేయసాగింది. అలా చేసేటప్పుడే ఒత్తిడి ఎక్కువగా ఉన్న కోతుల్లో లింఫ్‌నోడ్స్ కూడా ప్రభావితం అవుతున్నట్లు గుర్తించారు. నిజానికి మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తికి సంబంధించిన కణాలన్నీ లింఫ్ నోడ్స్‌లోనే ఉంటాయి. దాంతోపాటు శరీరంలోని విషపదార్థాలను విసర్జించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇలా విసర్జించే లింఫాటిక్ వ్యవస్థను క్యాన్సర్ కణాలు హైజాక్ చేస్తాయి. వాటిద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీర్ఘకాలం పాటు ఒత్తిడి ఉంటే లింఫాటిక్ వ్యవస్థకు.. రొమ్ములో ఏర్పడే కణితులకు మధ్య కనెక్షన్ల సంఖ్య పెరుగుతుందని కూడా గుర్తించారు. ఈ కనెక్షన్ల వల్ల క్యాన్సర్ మరింత వేగంగా విస్తరిస్తుంది. అయితే… అదే సమయంలో ఒత్తిడిని నిరోధించేందుకు కొన్నిరకాల రసాయనాలను అడ్డుకునే బీటా బ్లాకర్ మందులు ఉపయోగిస్తే.. ఈ ప్రభావాలు చాలావరకు తగ్గుతాయట!
ఒత్తిడి వల్ల తగ్గే రోగనిరోధక శక్తి
సాధారణంగా మన శరీరంలోని రోగనిరోధక శక్తి బలంగా ఉంటే… అది క్యాన్సర్‌పై పోరాడుతుంది. కానీ, ఒత్తిడి వల్ల ఈ రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. అయోవా యూనివర్సిటీ పరిశోధకులు 2000 ప్రారంభ సంవత్సరాల్లో చేసిన పరిశోధనలో… అండాశయ క్యాన్సర్ ఉన్న బాధితుల్లో రోగినిరోధక శక్తి బాగా తగ్గిపోవడానికి ప్రధాన కారణం మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటేనని గుర్తించారు. అలాగే, వారికి సామాజికంగా తగిన మద్దతు లభించకపోవడం వల్ల కూడా కుంగుబాటు పెరిగి.. కణితుల చుట్టూ రక్తనాళాలు పెరిగాయని, వాటివల్ల కణితులు మరింత వేగంగా విస్తరించాయని తెలిసింది. ఈ రక్తనాళాల ద్వారానే క్యాన్సర్ కణితులకు కావల్సిన పోషకాలు, రక్తం సరఫరా అవుతున్నాయి.
కణితులపై ఒత్తిడి ప్రభావం
ఒత్తిడికి గురికావడం వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతిని, చివరకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. అండాశయ క్యాన్సర్ ఉన్న ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయం రుజువైంది. అప్పటికే క్యాన్సర్ వచ్చినవాటిలో అయితే అది మరిన్ని శరీరభాగాలకు విస్తరించింది. అదే సమయంలో.. బీటా బ్లాకర్లనే మందులను ఉపయోగించినప్పుడు ఈ ప్రభావాలన్నీ ఆగిపోయాయి. రక్తక్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ బాధితుల్లో కూడా ఈ బీటా బ్లాకర్లు బాగా పనిచేసి.. క్యాన్సర్ విస్తరణ ఆగడంతో పాటు రోగనిరోధక శక్తి పెరిగింది.
అందువల్ల ఇప్పటికే క్యాన్సర్ వచ్చిన బాధితులతో పాటు.. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉన్నవాళ్లు, చివరకు అన్ని విధాలా శారీరక ఆరోగ్యం బాగున్నవాళ్లు కూడా ఒత్తిడికి, కుంగుబాటుకు వీలైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలని, మానసిక ఆరోగ్యానికి కూడా అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.