ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయ బాటలోకి అడుగుపెట్టింది. పంజాబ్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. 158 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఆర్సీబీ బ్యాటర్లు అలవోకగా ఛేదించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని బెంగళూరు 18.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఛేజ్ చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ త్వరగా వెనుదిరిగినా, ఆ తరువాత విరాట్ కోహ్లీ (73), దేవ్‌దత్ పడిక్కల్ (61) మధ్య జరిగిన భాగస్వామ్యం మ్యాచ్‌ను ఒక్కసారిగా ఆర్సీబీ వైపు తిప్పేసింది.
వీరిద్దరూ మైదానంలో సమయాన్ని వృథా చేయకుండా అటాకింగ్ మూడ్‌లో బౌండరీల వర్షం కురిపించారు. దేవ్‌దత్ పడిక్కల్ 35 బంతుల్లో 4 సిక్సులు, 5 ఫోర్లతో 61 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సుతో 73 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, హర్‌ప్రీత్ ఒక్కొక్క వికెట్ తీసినా, బెంగళూరు బ్యాటర్లపై ఒత్తిడి తేవలేకపోయారు.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (33) కలిసి మంచి ఆరంభం ఇచ్చారు. కానీ మధ్యలో వికెట్లు తక్కువ స్కోర్లకే కుప్పకూలడంతో పెద్ద స్కోర్ సాధించలేకపోయారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నిరాశపరిచాడు. అతను కేవలం 6 పరుగులకే అవుటయ్యాడు. గత మ్యాచ్‌లో హీరోగా నిలిచిన నేహల్ వధేరా ఈసారి రనౌట్ అయ్యి 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. సుయాష్ శర్మ ఒకే ఓవర్‌లో జోష్ ఇంగ్లిస్ (29), స్టోయినిస్ (1)లను క్లీన్ బౌల్డ్ చేయడంతో పంజాబ్ మిడిల్ ఆర్డర్ కుదేలైంది. చివర్లో శశాంక్ సింగ్ (31), మార్కో జాన్సెన్ (25) పోరాడినప్పటికీ భారీ స్కోర్ రాలేదు. ఆర్సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ, క్రుణాల్ పాండ్యా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షెపార్డ్ ఒక్క వికెట్ తీసి ఆకట్టుకున్నాడు. ఈ విజయంతో బెంగళూరు జట్టు ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.