పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) మృతి పట్ల ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఫ్రాన్సిస్ మరణం పట్ల తాను తీవ్ర దుఃఖానికి గురయ్యానని ప్రధాని మోదీ(PM Modi) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ విచారకర సమయంలో ప్రపంచ క్యాథలిక్ సమాజానికి తన సంతాపం తెలియజేస్తున్నట్లు తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ సేవలను, ఆయనలోని గొప్ప గుణాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో పోప్ ఫ్రాన్సిస్ కరుణ, వినయం, ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు. ఏసుక్రీస్తు ఆశయాలకు అనుగుణంగా జీవించేందుకు తనను తాను అంకితం చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. భారత ప్రజల పట్ల పోప్ ఫ్రాన్సిస్ చూపిన ప్రేమ, ఆప్యాయత ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని తెలిపారు.
క్యాథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన వినయం, కరుణ, శాంతి సందేశం ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తిని ఇచ్చిన ఆధ్యాత్మిక గురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం తనకు చాలా బాధ కలిగించిందని పేర్కొన్నారు. మానవాళిని ప్రేమ, దయతో నడిపించారని ఆయన కొనియాడారు.
రోమన్ క్యాథలిక్ అత్యున్నత మతగురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సామాజిక న్యాయం కోసం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా పోప్ ఫ్రాన్సిస్ అవిశ్రాంతంగా పోరాటం చేశారని కొనియాడారు.
శాంతి సందేశం ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్ర ప్రజల తరఫున ప్రపంచ క్యాథలిక్ సమాజానికి తన సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఆధ్యాత్మిక నాయకత్వంలో తరతరాలకు పోప్ ఫ్రాన్సిస్ స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.