మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హఫీజ్ పేటలో తన భూమిని హైడ్రా(Hydra) అన్యాయంగా స్వాధీనం చేసుకుందని పిటిషన్ దాఖలు చేశారు. తమ భూముల్లో ఉన్న నిర్మాణాలను సైతం కూల్చేశారని పేర్కొన్నారు. అందుకు హైడ్రా నష్టపరిహారం చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
కాగా వసంత కృష్ణప్రసాద్ హాఫీజ్ పేటలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారంటూ అందులో ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసిన సంగతి తెలిసిందే. కూల్చివేసిన నిర్మాణాల్లో వసంత కృష్ణప్రసాద్ ఆఫీస్ కూడా ఉంది. మొత్తం 17 ఎకరాలను స్వాధీనం చేసుకుని హైడ్రా బోర్డు పెట్టేసింది. హైడ్రా కూల్చివేతలపై వసంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి రాగానే ఆయనను కలుస్తానని పేర్కొన్నారు.