కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ప్రభుత్వం విమర్శలు కొనసాగిస్తోంది. తాజాగా చెన్నైలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నందనం ప్రాంతంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో రూ. 4.80 కోట్ల వ్యయంతో నిర్మించిన “ముత్తమిళ్ కళైంజర్ ఆడిటోరియం” ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్.. హిందీ భాషను వ్యతిరేకిస్తూ డీఎంకే నాయకుల పోరాటాన్ని గుర్తు చేశారు.
పెరియార్, అన్నా, ముత్తమిళర్ కరుణానిధి, సీఎం ఎంకే స్టాలిన్ వరకు హిందీని వ్యతిరేకిస్తూ నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేశారు. 1986లో హిందీకి వ్యతిరేకంగా కరుణానిధి చేసిన ప్రసంగం ఇప్పటికీ అందరికీ గుర్తే అని ఉదయనిధి పేర్కొన్నారు. 1956లో జరిగిన విద్యార్థుల ఉద్యమాలే తమిళ సంస్కృతిని కాపాడిన మైలురాళ్లుని ఆయన పేర్కొన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన NEET, NEP విధానాల గురించి మాట్లాడుతూ… ఇవి తమిళనాడు విద్యా వ్యవస్థను దెబ్బతీయడానికి, హిందీని బలవంతంగా రుద్దడానికి కేంద్రం చేపట్టిన ప్రయత్నాలన్నారు.
ఇది కేవలం భాషకు వ్యతిరేకంగా గళం వినిపించడం కాదు… ఇది తమిళ సాంస్కృతిక గుర్తింపును నిలుపుకోవడానికి జరుగుతున్న పోరాటమని పేర్కొన్నారు. హిందీని రుద్దే ప్రయత్నాలకు తాము ఒప్పుకోమని.. ఈ ఉద్యమం కొనసాగుతుందని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. ఇక తాజాగా కేంద్ర–తమిళనాడు మధ్య భాష, విద్యా విధానాలపై వివాదం మరింత ముదురే అవకాశాలు కనిపిస్తున్నాయి.