టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును ఏన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు పిలిపించింది. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టుల వివాదాస్పద వ్యవహారాల్లో ఆయనకు సంబంధం ఉందని భావించి, ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ రెండు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన మహేశ్ బాబు, వాటి ప్రమోషన్‌లో కీలక పాత్ర పోషించారని, ఆ ప్రభావంతో ప్రజలు భారీగా పెట్టుబడులు పెట్టారని ఈడీ అనుమానిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయన తీసుకున్న పారితోషికం కూడా ఈడీ దృష్టికి వచ్చింది. సాయిసూర్య డెవలపర్స్ మరియు సురానా ప్రాజెక్టుల తరఫున మహేశ్ బాబు తీసుకున్న మొత్తం రూ.5.9 కోట్లలో, రూ.2.5 కోట్లు అక్రమ మార్గాల్లో లభించాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల, ఈడీ హైదరాబాద్‌లోని సంబంధిత కంపెనీల కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లపై సోదాలు జరిపింది. ఇందులో నరేంద్ర సురానా నివాసంలో రూ.74.5 లక్షలు సీజ్ చేశారు. సంస్థలు తీసుకున్న మొత్తం రూ.100 కోట్ల వరకు వసూలైన డబ్బు అక్రమ లావాదేవీల్లో మళ్లించబడినట్లు ఆధారాలు లభించాయి.
సాయిసూర్య డెవలపర్స్‌కు చెందిన కంచర్ల సతీశ్ చంద్రగుప్తా పై ఇప్పటికే మోసం కేసు నమోదైంది. వెంగళ్రావునగర్ ప్రాజెక్టులో తమను మోసగించారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2021లో షాద్‌నగర్‌లోని ఓ వెంచర్ కోసం రూ.3 కోట్లు చెల్లించామని తెలిపారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, పరోక్షంగా అయినా ఈ వ్యవహారాల్లో ప్రమోషన్ ద్వారా ప్రజలను ఆకర్షించడంలో మహేశ్ బాబు పాత్ర ఉందని భావించిన ఈడీ అధికారులు ఆయనపై నోటీసులు జారీ చేశారు. అయితే రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాల్లో మహేశ్ బాబు నేరుగా భాగస్వామిగా లేడన్నదే ప్రాథమికంగా స్పష్టమవుతోంది. కానీ అక్రమ పద్ధతుల్లో డబ్బు స్వీకరించిన అంశాన్ని కేంద్రంగా చేసుకొని ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.