తెలంగాణలో రోహిత్ వేముల చట్టం అమలు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఏప్రిల్ 17న సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ద్వారా విద్యాసంస్థల్లో కుల వివక్ష, వేధింపులను అరికట్టి, విద్యార్థులకు సమాన అవకాశాలు, రక్షణ కల్పించాలని కోరారు. తాజాగా రాహుల్ లేఖపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“జపాన్‌లోని హిరోషిమా చారిత్రక నగరంలో నేను మీ లేఖను చదివాను. అదృష్టవశాత్తూ ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం ఉన్న పవిత్ర స్థలాన్ని సందర్శించబోతున్నప్పుడు మీ లేఖ చదివాను. మీ స్ఫూర్తిదాయకమైన పిలుపు నాకు బలంగా తాకింది. గర్వించదగిన భవిష్యత్తును రూపొందించడంలో మీ ఆలోచనలు, భావజాల స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. రోహిత్ వేముల చట్టం అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షను నిర్మూలించడం, విద్యార్థుల హక్కులను కాపాడటం మా ప్రభుత్వ లక్ష్యం. ఈ చట్టం కోసం అవసరమైన చట్టపరమైన, విధానపరమైన చర్యలను వేగవంతం చేస్తాం” అని రేవంత్ వెల్లడించారు.