వేసవి వచ్చిందంటే చాలు… మామిడి పండ్ల రుచుల కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. పండ్ల రాణిగా పేరొందిన మామిడి పేరు వినగానే నోట్లో నీరు ఊరుతుంది. మార్కెట్లలో పచ్చగా, పసుపుగా మెరుస్తూ కనిపించే పండ్లు ఆకర్షణీయంగా ఉండటంతో కొనుగోలు ఎక్కువగా జరుగుతోంది. అయితే ఆ అందమైన పండ్ల వెనక పొతేనికే ప్రమాదం దాగి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న పండ్లలో చాలా వరకు సహజంగా కాకుండా రసాయనాలతో పండించబడుతున్నాయని, ఇవి ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగించి వ్యాపారులు మామిడిని తొందరగా పండించేస్తున్నారు. సహజంగా పండే సమయం వేచి చూడకుండా వ్యాపార లాభాల కోసం ఇలాంటి ప్రమాదకరమైన పద్ధతులను అవలంబిస్తున్నారు. కాల్షియం కార్బైడ్ వాడిన మామిడి పండ్లను తినడం వల్ల నోరు మండిపోవడం, గొంతులో మంట, వికారం, వాంతులు, కడుపునొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశముంది. పలు పరిశోధనల్లో ఈ కెమికల్ కేన్సర్‌కే దారితీస్తుందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
రసాయనాలతో పండించిన మామిడిని గుర్తించడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. సహజంగా పండిన మామిడి తీయని వాసన ఇస్తుంది. రసాయనాలతో పండించిన మామిడికి ఆ సువాసన ఉండదు లేదా చాలా తక్కువగా ఉంటుంది. కెమికల్స్ వాడిన పండ్లు ఎక్కువగా ముదురు పసుపు లేదా గోధుమ రంగులో మెరిసిపోతూ ఉంటాయి. బయట మెరిసిపోతున్నా, చేతితో పట్టుకుంటే ఎక్కువగా మెత్తగా ఉంటే అది సహజంగా కాకుండా రసాయనాలతో పండించిన పండే కావచ్చు. కొన్నిసార్లు పండు ఒకవైపు పండినట్టు ఉండి, ఇంకోవైపు మాత్రం పచ్చగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే అలాంటి పండ్లను తీసుకోకూడదు. మామిడి తొక్కపై తెల్లటి లేదా బూడిద రంగులో పొడి కనిపిస్తే అది కాల్షియం కార్బైడ్ వాడిన పండు అయ్యే అవకాశముంది. లోపల గజ్జు బ్రౌన్ రంగులో మారి ఉండడమూ కెమికల్ ప్రభావం అని అర్థం చేసుకోవచ్చు.
రుచికోసం, తక్కువ ధర కోసం ఇలాంటి పండ్లను తీసుకుంటే అది ఆరోగ్యాన్ని క్షీణించించే పరిణామాలకు దారితీస్తుంది. అందుకే మామిడి కొనేటప్పుడు మెరుగైన నాణ్యత కలిగిన పండ్లను ఎంచుకోవాలి. పండ్లు సహజంగా పండితేనే శరీరానికి మేలు చేస్తాయి. రుచికి మించినదీ ఆరోగ్యం అనే విషయాన్ని మరవకూడదని నిపుణులు సూచిస్తున్నారు.