ఢిల్లీ హైకోర్టు యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. షర్బత్ జిహాద్ అనే పదం వాడడం అభ్యంతరకరమని, ఇది కోర్టు మనస్సాక్షిని కలచివేసిందని స్పష్టం చేసింది. మతాల మధ్య చిచ్చు పెడతాయని పేర్కొంటూ, ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా ఖండించతగినవని పేర్కొంది. ఇటీవల బాబా రాందేవ్ తన పతంజలి సంస్థ తరపున గులాబీ షర్బత్ కోసం ఒక ప్రచార వీడియోను విడుదల చేసింది. అందులో ప్రముఖ శరబత్ బ్రాండ్ రూహ్ అఫ్జా పేరు నేరుగా చెప్పకపోయినా, దాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఆ కంపెనీ పానీయం అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని మసీదులు, మదర్సాలు నిర్మించడానికి వినియోగిస్తారని పేర్కొన్నారు. మరోవైపు, పతంజలి ఉత్పత్తుల ఆదాయం గురుకులాలు, విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పారు. అంతేకాదు, లవ్ జిహాద్, ఓటు జిహాద్‌లా ఇప్పుడు షర్బత్ జిహాద్ జరుగుతోంది’ అని వ్యాఖ్యానించడం పెద్ద దుమారానికి దారితీసింది.
ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రూహ్ అఫ్జా బ్రాండ్ తయారీదారు హమ్‌దార్డ్ సంస్థ, కోర్టును ఆశ్రయించింది. రాందేవ్ వ్యాఖ్యలతో ఉన్న వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. హమ్‌దార్డ్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇది ఉత్పత్తిని మాత్రమే కాదు, మతాలను కించపరచే ప్రయత్నంగా అభివర్ణించారు.
ఇది ద్వేష ప్రసంగానికి సమానం. ఇలాంటి మాటలు చెప్పి ఇతర బ్రాండ్లను కించపరచడం ద్వారా వ్యాపారం చేయడం సమంజసం కాదని అని వ్యాఖ్యానించారు. గతంలో కరోనా సమయంలో కూడా బాబా రాందేవ్ బాబా ఆరోపణలతో వార్తల్లోకి వచ్చారని, అప్పుడూ న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నాయని గుర్తుచేశారు. ఆశ్చర్యకరం ఏంటంటే, అప్పుడు పతంజలి తరపున వాదించినవారే రోహత్గి కావడం విశేషం.
రాందేవ్ తరపున ప్రధాన న్యాయవాది హాజరుకాలేకపోవడంతో, ప్రాక్సీ న్యాయవాది హాజరయ్యారు.
దీంతో జస్టిస్ బన్సాల్ మధ్యాహ్నం ప్రధాన న్యాయవాది తప్పనిసరిగా హాజరుకావాలంటూ ఆదేశించారు. లేకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం న్యాయవాది రాజీవ్ నాయర్ కోర్టులో హాజరై, రాందేవ్ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అయితే వీడియోలను పూర్తిగా సోషల్ మీడియాలో నుంచి తొలగించాలన్న కోర్టు ఆదేశాలతో పాటు, ఇందుకు సంబంధించిన అఫిడవిట్‌ను వారం రోజుల్లోగా దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను మే 1కి వాయిదా వేసింది.