ఐపీఎల్ 2025 సీజన్‌లో సంచలన ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. ఏప్రిల్ 19న జరిగిన రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందంటూ ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. 2 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడంతో.. దీనిపై ఆరోపణలు వెలుగు చూశాయి. ఈ మ్యాచ్ ఫిక్సింగ్‌కు గురైందని, సజావుగా సాగిన మ్యాచ్‌ను చివర్లో చేజార్చడమే దీనికి నిదర్శనమని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక కన్వీనర్ జైదీప్ బిహాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ మ్యాచ్‌లో విజయం రాజస్థాన్ గెలవడం ఖాయంలా కనిపించింది.. అయినా ఓడిపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేసిన జైదీప్ బిహాని, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. అంతేకాదు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్‌హాక్ కమిటీ ఇప్పటికే ఐదుసార్లు పొడగించబడిందని.. అసోసియేషన్ నిర్వహణలో జరిగిన ఇతర మ్యాచ్‌లు ప్రశాంతంగా ముగుస్తున్నప్పటికీ, ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి నియంత్రణ జిల్లా పరిషత్ చేతుల్లోకి వెళ్లినట్లుగా పేర్కొన్నారు.
అయితే బీసీసీఐ మాత్రం అధికారికంగా ఐపీఎల్ నిర్వహణకు ఆర్‌సీఏకే లేఖ రాసిందని, అయినా సరే సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఉపయోగంపై ఎంఓయూ లేదని రాయల్స్ మేనేజ్‌మెంట్ చెబుతుండడం ఆశ్చర్యంగా ఉందని జైదీప్ ప్రశ్నించారు. ఎంఓయూ లేకపోతే జిల్లా పరిషత్‌కు ప్రతి మ్యాచ్‌కి అద్దె ఎందుకు చెల్లిస్తున్నారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ కు సంబంధించి గతంలోనూ వివాదాలు వెలుగుచూశాయి.
2016, 2017 సీజన్లలో సహ యజమాని రాజ్ కుంద్రా బెట్టింగ్ ఆరోపణలతో రాయల్స్ జట్టును రెండేళ్ల పాటు ఐపీఎల్ నుంచి నిషేధించారు. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపైనా అదే విధమైన చర్యలు తీసుకున్న విషయం గుర్తించాల్సినది. ఇప్పుడు కొత్త ఆరోపణలతో రాజస్థాన్ రాయల్స్ మరోసారి వివాదాల దుమారంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ఆరోపణలపై బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.