వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు(Duvvada Srinivas) ఊహించని షాక్ తగిలింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) నిర్ణయం తీసుకున్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.
‘‘పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాసనమండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైసీపీ అధ్యక్షులు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అని ప్రకటనలో తెలిపింది.
కాగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం గత కొన్ని నెలలుగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దివ్వెల మాధురి అనే మహిళతో శ్రీనివాస్ కలిసి ఉండటం ఆయన భార్య, పిల్లలు ఇంటికొచ్చి గొడవ చేయడంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత శ్రీనివాస్, మాధురి కలిసి తిరుమలకు వెళ్లిన సమయంలో అక్కడ ఫొటో షూట్ నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోవైపు ఇద్దరు కలిసి పలు ఇంటర్వ్యూలలో పాల్గొనడంతో సోషల్ మీడియాలో వీరి వ్యవహారం బాగా వైరల్ అవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.