జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో(Pahalgam Terror Attack) శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుసూదన్‌రావు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం ఆయన భౌతికకాయం కావలికి చేరుకుంది. మధుసూదన్ భౌతికకాయాన్ని బుధవారం రాత్రి చెన్నై ఎయిర్‌పోర్టుకు అధికారులు తీసుకురాగా.. అక్కడి నుంచి గురువారం ఉదయం రోడ్డు మార్గంలో కావలికి తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
స్థానిక కుమ్మరవీధిలో ఆయన తల్లిదండ్రులు తిరుపాల్, పద్మావతి నివాసముంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన మధుసూదన్ రావు ఉద్యోగరీత్యా 12 ఏళ్ల క్రితమే బెంగళూరులో స్థిరపడ్డారు. కాగా పవాల్గాం ఉగ్రదాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు మృతి చెందిన విషయం విధితమే.