పవాల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్(India), పాకిస్తాన్(Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఫోన్‌లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్ దేశస్తుల వివరాలు సేకరించాలని ఆదేశించారు. వెంటనే వారిని వెనక్కి పంపించే అంశంలో కేంద్రానికి సపోర్ట్ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో(Hyderabad) దాదాపు 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించిన భద్రతా బలగాలు వారిని వెనక్కి పంపేందుకు చర్యలు చేపట్టాయి.
ఈ క్రమంలో భారత్‌లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న పాకిస్థానీయులు స్వదేశం వెళ్లేందుకు అటారీ సరిహద్దు వద్ద క్యూ కట్టారు. ఈ పరిణమాలతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మరోవైపు ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని భారత్ తగిన ఆధారాలను సేకరిస్తోంది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను వివిధ దేశాలకు చెందిన విదేశీ కార్యదర్శులకు అందజేసింది.