మాజీ మంత్రి విడదల రజనీకి(Vidadala Rajini) హైకోర్టులో ఊరట లభించింది. క్రషర్స్ యజమానిని బెదిరించారనే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రజనీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆమెను అరెస్టు చేయకుండా 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశించింది. అలాగే ఇదే కేసులో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాకూ కూడా 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రజనీ మరిది గోపి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మాత్రం కొట్టివేసింది. ఇప్పటికే ఆయనను అరెస్టు చేసినందున పిటిషన్ పరిగణనలోకి తీసుకోలేమని చెప్పింది. మాజీ మంత్రి తరపున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
కాగా 2020 సెప్టెంబరు 4న పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ కండ్రికను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ ఎస్పీ జాషువా తనిఖీల పేరుతో బెదిరించారని.. రూ.5 కోట్లు ఇవ్వాల్సిందేనని ఆమె పీఏ రామకృష్ణ డిమాండ్ చేశారని బాధితులు తెలిపారు. అయితే చివరకు రూ.2 కోట్లు ఇచ్చామని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఐపీఎస్ జాషువాకు రూ.10 లక్షలు, ఆమె మరిది గోపికి మరో రూ.10లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులోపేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు విడదల రజిని ఆదేశాల మేరకే తాము తనిఖీలు చేపట్టినట్లు ఐపీఎస్ జాషువా వాంగ్మూలం ఇచ్చారు.