పహల్గామ్‌లో భారతీయ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని(Pahalgam Terror Attack) తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తితో పీవోకేను ఆక్రమించి పాకిస్థాన్‌ను రెండుగా చేయాలని ప్రధాని మోదీకి సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు ఇస్తామని తెలిపారు.
రేవంత్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడాన్ని కొనియాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం స్థాయి వ్యక్తి.. బహిరంగంగా పీవోకేను ఆక్రమించాలని ప్రధాని మోదీకి సూచించడం గ్రేట్ అని పోస్టులు పెడుతున్నారు. కాగా ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కుటుంబాలకు నివాళిగా హైదరాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్‌లు పాల్గొన్నారు.