ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఓడిపోయిన సంగతి తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు స్టేడియానికి వచ్చారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. సీఎస్‌కే బ్యాటర్లలలో డెవాల్డ్ బ్రెవిస్ (42), ఆయుష్ మాత్రే (30) రాణించగా.. దీపక్ హుడా (22), రవీంద్ర జడేజా (21) లు ఫర్వాలేదనిపించారు. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్ చెరో రెండు వికెట్లు తీశారు. షమీ, కమిందు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 155 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (44), కమిందు మెండిస్ (32)లు రాణించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, రవీంద్ర జడేజాలు తలా ఓ వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడంతో మ్యాచ్‌కు హాజరైన అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్(Shruti Haasan) కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ భావోద్వేగానికి లోనైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.