హిందూ సంప్రదాయంలో ప్రతి తిథి, ప్రతి వారానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులోను వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథికి, అంటే అక్షయ తృతీయకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 30న జరుపుకోబోతున్నారు. వైదిక పంచాంగం ప్రకారం, శుక్ల పక్ష తృతీయ తిథి ఏప్రిల్ 29 సాయంత్రం 4:29 గంటలకు మొదలై, ఏప్రిల్ 30 మధ్యాహ్నం 3:11 గంటలకు ముగుస్తుంది. ఉదయ కాలంలో తృతీయ తిథి ఉన్నందున, ఏప్రిల్ 30న అక్షయ తృతీయ వేడుకలు నిర్వహించాల్సి ఉంటుంది.
అక్షయ తృతీయను లక్ష్మీదేవి, ధనాధిపతి కుబేరుడి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే సంపద, శ్రేయస్సు జీవితాంతం డబ్బుకి లోటు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
శంఖం తీసుకురావడం: అక్షయ తృతీయ రోజున దక్షిణావర్త శంఖాన్ని ఇంటికి తీసుకురావడం ఎంతో శుభప్రదం. దీన్ని డబ్బు నిల్వచేసే ప్రదేశంలో ఉంచితే, దుఃఖం, పేదరికం తొలగి ధన సమృద్ధి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
కుబేర యంత్రం: ఈ రోజున కుబేర యంత్రాన్ని పూజించి, ఖజానాలో ఉంచడం వల్ల అదృష్టం, ధన వృద్ధి, శ్రేయస్సు కొనసాగుతాయని నమ్మకం. పౌర్ణమి, ధనత్రయోదశి, దీపావళి వంటి ముఖ్య రోజుల్లో దీనికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటే ప్రభావం మరింత పెరుగుతుంది.
శ్రీ యంత్రం: శ్రీ యంత్రాన్ని గంగాజలంతో శుద్ధి చేసి, అక్షతలు చల్లి ‘ఓం శ్రీం’ మంత్రాన్ని 108సార్లు జపించి, ఇంటి ఖజానాలో ఉంచాలి. ఇది జీవితాంతం ధనాభివృద్ధికి మార్గం ఏర్పరుస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు.
వెండి కొనడం : అక్షయ తృతీయ నాడు వెండి కొనడం అదృష్టదాయకమని చెప్పబడుతుంది. చిన్న వెండి నాణాన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి.. డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో ఉంచడం వల్ల, ఖజానాలో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదట.