వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జోరుగా సాగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 11 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. ఇన్ని సంవత్సరాలు పాలనలో ఉన్న బీజేపీ ఒక్క రూపాయి కూడా తెలంగాణకు మంజూరు చేసిందా? ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇచ్చిందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
ఇక కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల పేరుతో యువకులపై అక్రమంగా దాడులు చేస్తున్నారని, వెంటనే ఆ ఆపరేషన్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కేంద్ర పాలకుల తీరు ప్రజాస్వామ్యానికి హానికరమని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు తెలంగాణ అసెంబ్లీలోకి రావాలని పిలుపునిస్తూ చేస్తున్న వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందిస్తూ.. పిల్లలు ఏదైనా అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారు.. ఇక నన్ను చేతిలో కత్తి పెట్టి యుద్ధం చేయమంటారా అని మండిపడ్డారు. తన నేతృత్వంలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టామని, అయితే ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అది 14వ స్థానానికి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొడుతున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా చేస్తూ మరో రెండున్నరేళ్లు వృథా చేయడం తప్ప చేయగలిగిన పని ఏమీ లేదు” అని విమర్శించారు. ఒకవైపు ప్రజాస్వామ్య విలువలను తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తూ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలని కుట్రలు పన్నుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. హెచ్‌సీయూ భూముల విషయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను అమ్మడం తగదని, ఎంతవరకైనా భూములు అమ్మాలని నిర్ణయించినా, ఏ భూములను అమ్మాలనే అంశంలో కనీస విచక్షణ అవసరమని హితవు పలికారు. మొత్తం మీద, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేదికగా కేసీఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.