పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం దాయాది పాకిస్థాన్‌పై భారత్ కఠినచర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను(YouTube channels) నిషేధించింది. పహల్గామ్ దాడి తర్వాత ఈ ఛానళ్లు భారత్‌పై విషం కక్కడంతో పాటు రెచ్చగొట్టేలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ గుర్తించింది. హోంమంత్రిత్వశాఖ సిఫార్సులతో ఆయా ఛానళ్లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇందులో డాన్, సామా టీవీ, ఏఆర్వై న్యూస్, జియో న్యూస్, రాజీ నామా, జీఎన్ఎన్, ఇర్షాద్ భట్టి, ఆస్మా షిరాజీ, ఉమర్ చీమా, మునీబ్ ఫరూఖ్, బోల్ న్యూస్, రాఫ్తార్, సునో న్యూస్, పాకిస్థాన్ రిఫరెన్స్, సామా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్ వంటి చానళ్లు ఉన్నాయి. అలాగే పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌కు చెందిన ‘100mph’ ఛానల్ కూడా ఉంది. వీటన్నింటికీ కలిపి మొత్తం 6.3 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమాచారాన్ని తొలగించినట్లు ఆయా ఛానళ్లకు యూట్యూబ్ కంపెనీ సందేశం పంపించింది.