ఏపీలో మెగా డీఎస్సీ(Mega DSC) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారిన పలు నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తు పార్ట్2 కింద సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయడం తప్పనిసరి కాదని తెలిపారు. అయితే పత్రాల ధ్రువీకరణ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు. డీఎస్సీ అర్హత కోసం గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కుల ప్రమాణాలు టెట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు.
అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అంకితభావంతో చదివి డీఎస్సీలో అభ్యర్థులు విజయం సాధించాలని కోరారు. కాగా ఏప్రిల్ 20న మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.