పహల్గామ్ ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) అమరవీరులకు జనసేన సంతాపం ప్రకటించింది. మంగళగిరిలోని సి.కె.కన్వెన్షన్‌లో హాలులో నిర్వహించిన సంతాప సభలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మంత్రి నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృతులకు సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ.. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాక్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని సూచించారు. కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉందని.. అధికారం రాష్ట్రం చేతిలోకి వెళ్లగానే ఇలాంటి దుర్ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్‌రావు కుటుంబానికి పార్టీ తరఫున రూ.50లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.