రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) పేరు మార్మోగుతున్న సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ తన బ్యాటింగ్ ప్రతిభతో చరిత్ర సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించడంతో పాటు అనంతరం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 11 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. వైభవ్ ప్రతిభకు ఫిదా అయిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ రూ.10లక్షల నజరానా ప్రకటించారు.
వైభవ్ సూర్యవంశీ గతంలో కూడా తన ప్రతిభను చాటాడు. 13 ఏళ్ల వయస్సులోనే భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై 58 బంతుల్లో శతకం సాధించాడు. అలాగే 12 ఏళ్ల వయస్సులోనే రంజీ ట్రోఫీలో బిహార్ తరఫున అరంగేట్రం చేశాడు. ఈ ప్రదర్శనలతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 1.10 కోట్ల రూపాయలకు కొనుగోలు అయ్యాడు.