బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి రెచ్చిపోయారు. రవీంద్రభారతిలో జరిగిన 892వ బసవేశ్వర జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. నిన్నగాక మొన్న ఒకాయన వరంగల్‌లో సభ పెట్టారని.. సభకు ఎన్ని వందల బస్సులు అడిగితే అన్ని బస్సులు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో అధికార పక్షమే కాదు.. ప్రతిపక్షం కూడా ఉండాలని అందుకు సహకరించామని చెప్పారు. అన్ని వసతులు అనుభవిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే ఎలా అంటూ మండిపడ్డారు. అసెంబ్లీకి తాను రాను.. పిల్లల్ని పంపిస్తా అంటున్నారని.. మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం..? అని ప్రశ్నించారు.
అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు? ఫార్మ్ హౌస్‌లో పడుకుని ఏం సందేశం ఇస్తున్నారు? అధికారంలో ఉంటే చెలాయిస్తాం.. లేదంటే అసెంబ్లీకే రాను అంటే ఎలా? అని నిలదీశారు. విద్వేషపూరిత ప్రసంగంతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహించారు. పదేళ్లు తామే అధికారంలో ఉంటామని.. అదే పదేళ్లు ఫార్మ్ హౌస్‌లోనే ఉంటావని.. ఆ తర్వాత నీ చరిత్ర ఫార్మ్ హౌస్‌లోనే పరిసమాప్తం అవుతుందంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడు దశాబ్దాల కలను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? మరెందుకు విలన్ అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.