విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. దాడి సమయంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) కార్యాలయంలోనే ఉన్నారు. బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని ఆమె మండిపడ్డారు. ఇదేనా మహిళలను ట్రీట్ చేసే విధానమని ఆగ్రహించారు. బీజేపీ నాయకులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నా, కూటమి ప్రభుత్వం ఉన్నా అధికార పెత్తనం మాత్రం బీజేపీదే అని ఆరోపించారు.
గత పదకొండేళ్లుగా రాష్ట్రాన్ని ప్రధాని మోడీ నాశనం చేశారని విమర్శించారు. మోడీ మోసాలను నిలదీస్తే తనను టార్గెట్ చేసి దాడి చేయిస్తారా..? కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేస్తారా..? ఏపీసీసీ అధ్యక్షురాలి పైనే ఇలా దాడికి తెగబడితే.. ఇక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు మీ పాలనలో మహిళలకు జరిగే న్యాయం ఇదేనా అని నిలదీశారు. ఇటువంటి ఘటనలు జరగకుండా తక్షణమే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేస్తున్నాం. అంతకుముందు షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.