తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్–2025 (Miss World 2025) పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చూసిన టూరిజం శాఖ సెక్రటరీ స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ఇటీవల బదిలీ అయ్యారు. దీంతో ఆమె స్థానంలో సీనియర్ అధికారి(Jayesh Ranjan) జయేశ్ రంజన్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో జయేశ్ రంజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్మితా సబర్వాల్ ఎందుకు బదిలీ అయ్యిందో అందరికి తెలుసన్నారు. ఆమె లేకపోతే ఏ ఈవెంట్ జరగదు అని అనుకోవడం తప్పన్నారు. తనకు చాలా ఈవెంట్స్ చేసిన అనుభవం ఉందన్నారు. గతంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వచ్చిన సమయంలో, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ భార్య వచ్చినప్పుడు నిర్వహణ బాధ్యతలు తానే చూసుకున్నట్లు తెలిపారు. టూరిజం రంగంలో తనకు చాలా అనుభవం ఉందన్నారు. స్మితా బాగా పని చేసింది కానీ ఆమె లేనంత మాత్రాన ఏ ఈవెంట్ ఆగిపోదని స్పష్టం చేశారు. దీంతో జయేశ్ రంజన్ వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాగా ఐఏఎస్ అధికారిణిగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై స్వితా సబర్వాల్ ఇటీవల చేస్తున్న పోస్టులు వివాదస్పదమవుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఆమె వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.