ఆర్టీసీ కార్మికులు సమ్మె (RTC strike) ఆలోచన వీడాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోందన్నారు. మేడే సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ప్రేరేపితంతో విషపు మాటలు నమ్మి సమ్మె బాట పడితే మొత్తం ఆర్టీసీ సంస్థనే దెబ్బతింటుందన్నారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చించాలని సూచించారు. ఈ సంస్థ మీది.. గత ప్రభుత్వం 50 మంది కార్మికులను పొట్టనపెట్టుకుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికల పాత్ర మరువలేనిదన్నారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ విధానం అన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక సింగరేణి, ఆర్టీసీలో కారుణ్యనియామకాలను సులభతరం చేశామన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కార్మికులందరూ సహకరించాలన్నారు. గత ప్రభుత్వం అంఘటిత కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు. చనిపోయిన కార్మికుల పట్ల కనీసం మానవత్వంతో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా గిగ్ వర్కర్క్స్ విధానం తీసుకురాబోతున్నామన్నారు. పదేళ్లు ఏమీ చేయని కపట నాటక సూద్రధారి మళ్లీ బయటకు వచ్చారని… ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు.