టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మల్యాల మండలానికి చెందిన బీఆర్ ఎస్ నాయకుల పిల్లలు, కొండగట్టు డైరెక్టర్ క్వాలిఫై అయ్యారంటూ పలువురు నేతలు వ్యాఖ్యనించిన నేపథ్యంలో మండలానికి చెందిన పలువురు ఆలయ డైరెక్టర్లు స్పందించారు. అంజన్నసాక్షిగా పేపర్ లీకేజీ వ్యవహారంలో తమ పాత్ర ఉందని తేలినా, తమ ఖాతాల ద్వారా నగదు బదిలీ అయినట్టు నిరూపించినా ఎలాంటి శిక్షకైనా సిద్దమని, రాజకీయ లబ్ది కోసం అభాండాలు వేస్తే సహించేది లేదని ఈ సందర్బంగా డైరెక్టర్లు హెచ్చరించారు. కనీసం డిగ్రీ ఉత్తీర్ణత లేని తాను అర్హత ఎలా సాధ్యమో చెప్పాలని కొండగట్టు ఆలయ సభ్యుడిగా ఉన్న జున్న సురెందర్ డిమాండ్ చేశారు. నిత్యం ప్రజాసేవలో అంకితమవుతూ మండల అభివృద్దికి పాటుపడుతున్న జడ్పీటీసీ రామ్మోహన్ రావ్ ను సైతం టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలోకి లాగడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఆలయ డైరెక్టర్లు. పోతారం గ్రామస్దుడిగా ఉన్న మంత్రి కేటీఆర్ పీ.ఏ బండారి తిరుపతిని టార్గెట్ గా మాట్లాడుతున్న నాయకులు వాస్తవాలు గ్రహించి మాట్లాడితే బాగుంటుందని సిట్ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, ఎలాంటి మచ్చ లేని వ్యక్తులుగా పేరున్న వ్యక్తులపై ఆరోపణలు చేస్తే అబద్దం నిజం కాదని ఈ సందర్బంగా వారు పేర్కొన్నారు. అంజన్న సేవలో తరిస్తున్న తమను లీకేజీ వ్యవహారంలో లాగటంపై పరువు నష్టం దాఖలు చేస్తామని, తమ ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న వారిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు.