మహిళల టీ20 ప్రపంచకప్(Women’s T20 World Cup) షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీ 2026 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. జూలై 5న లండన్‌లోని ప్రఖ్యాత స్టేడియం లార్డ్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 24 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో 33 మ్యాచ్‌లు జరగనున్నాయి. 12 జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. లార్డ్స్, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్, లీడ్స్‌లోని హెడింగ్లీ, బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, సౌతాంప్టన్‌లోని హాంప్‌షైర్ బౌల్, లండన్‌లోని ది ఓవల్, బ్రిస్టల్ లోని కౌంటీ గ్రౌండ్ మైదానాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
భారత్, పాకిస్తాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే క్వాలిఫై అయ్యాయి. మరో నాలుగు జట్లు క్వాలిఫయర్స్ ద్వారా ఎంపిక కానున్నాయి. మొత్తం 12 జట్లను రెండు గ్రూపులు విభజిస్తారు. ఒక్కో గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా న్యూజిలాండ్ ఈ టోర్నీలో అడుగుపెట్టనుంది.