ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో(Liquor Scam Case) ఏ1 నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని(RAJ Kasireddy) కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కసిరెడ్డిని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరగా.. ఏడు రోజుల కస్టడీకే కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి వారం రోజుల పాటు అధికారులు విచారించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరగనుంది.
మరోవైపు రాజ్ కసిరెడ్డి పీఎ పైలా దిలీప్ చెన్నై నుంచి విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఫోన్ లోకేషన్ ద్వారా దిలీప్ కదలికలపై సిట్ బృందం నిఘా పెట్టింది. చెన్నై ఎయిర్ పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి విజయవాడ తీసుకురానున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం ఆయన వద్ద ఉందని భావిస్తున్నారు.