కేంద్ర ఎన్నికల సంఘం(CEC) కీలక నిర్ణయాలు తీసుకుంది. బర్త్, డెత్ రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయనున్నట్టు వెల్లడించింది. ఓటర్ల జాబితాకు సంబంధించి కచ్చితత్వంతో పాటు పౌరులకు ఓటింగ్ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా చేయడం కోసం దీనిని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఇందుకోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(RGI) నుంచి మరణ నమోదుల గణాంకాలను సేకరించనుంది. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసేందుకు ఎలక్ట్రానిక్స్ విధానంలో వివరాలను తీసుకుంటామని పేర్కొంది.
ఈ ప్రక్రియ ద్వారా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు మరణించిన వారి సమాచారం నేరుగా ఆర్‌జీఐ ద్వారా తీసుకుంటారు. ఎన్నికల నిబంధనలు-1960తో పాటు జనన, మరణాల నమోదు చట్టం-1969 ప్రకారం ఈసీకి సమాచారం సేకరించే అధికారం ఉంది. ఇదే సమయంలో బూత్ స్థాయి అధికారులకు కూడా ఇకపై ఫోటో ఐటీ కార్డులు ఇవ్వనున్నట్టు ఈసీ తెలిపింది. దీనివల్ల ఓటరు ధృవీకరణ, రిజిస్ట్రేషన్ డ్రైవ్ సమయంలో ప్రజలు బీఎల్ఓ అధికారులను గుర్తించడం సులభమవుతుందని వెల్లడించింది. అంతేకాకుండా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌లో సీరియల్, పార్ట్ నంబర్లు మరింత పెద్దగా కనిపించేలా మార్చనుంది.