వైసీపీ నేతలకు ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ(Bhuma Akhila priya) సవాల్ విసిరారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో తాను అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే.. రాజీనామా చేస్తానని అన్నారు. తనపై చేసిన ఆరోపణలపై తాను చర్చకు సిద్ధమని.. వైసీపీ వాళ్ళు సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. ఆళ్ళగడ్డలో నేరాలు ఘోరాలు జరుగుతున్నట్లు తప్పుడు వార్తలు రాశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను తాము సరిదిద్దే పనిలో ఉన్నామని తెలిపారు. అది మింగుడుపడక తమపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అహోబిలంలో కన్ స్ట్రక్షన్ చేయాలంటే పంచాయతీ తీర్మానం ఉండాలని.. సర్పంచ్‌గా వైసీపీ నేత ఉన్నప్పుడు ఇక అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అక్రమంగా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూల్చివేస్తామన్నారు. అక్రమ నిర్మాణాలన్నీ వైసీపీ హయాంలో జరిగినవే అన్నారు. వైసీపీ నాయకులకు అన్నీ అబద్ధాలు మాట్లాడటం పరిపాటి అయిపోయిందని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.