తెలంగాణ రాష్ట్రం రోహింగ్యాలకు అడ్డాగా మారిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యంత సున్నితమైన జిల్లా అయిన నల్గొండలో వామపక్ష తీవ్రవాదంతో పాటు ఐఎస్ఐ సంబంధిత కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఈ రెండూ బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా మూలాలు నల్గొండలోనే కనబడతాయని తెలిపారు. రాష్ట్రంలో ఎవరి అనుమతితో మదర్సాలు నడుస్తున్నాయని ప్రశ్నించారు.
మదర్సాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని నిలదీశారు. మదర్సాలలో కలెక్టర్, ఎస్పీ, విద్యాశాఖ అధికారులు ఎందుకు తనిఖీలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మదర్సాల వ్యవహారంపై కూడా దృష్టి సారించాలని సూచించారు. పహల్గాం ఘటన తర్వాత భారత్‌లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశీయులను బయటికి పంపమని కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. తెలంగాణ ప్రభుత్వానికి సోయి లేదని రఘునందన్ మండిపడ్డారు.