పబ్‌జీ లాంటి ఆన్‌లైన్ గేమ్స్.. యువత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఘటనం తాజాగా ఢిల్లీలో వెలుగుచూసింది. గంటల తరబడి మొబైల్‌లో గేమింగ్‌కి అలవాటుపడి ఒక 19 ఏళ్ల యువకుడి జీవితం తారుమారైంది. అతడి వ్యసనం చివరకు మంచానికే పరిమితం అయ్యేలా చేసింది.
ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ప్రతి రోజు కనీసం 12 గంటలు పబ్‌జీ గేమ్ ఆడేవాడు. అయితే ఆ ఆటే అతడి జీవితాన్ని చీకట్లో నెట్టేసింది. నడవలేని స్థితికి చేరడమే కాకుండా, మూత్రాశయంపై కూడా నియంత్రణ కోల్పోయాడు. అతడి ఆరోగ్యంపై కూడా ఈ పబ్ జీ గేమ్ తీవ్ర ప్రభావం చూపింది. వైద్యుల విచారణలో అతడి వెన్నెముకను ‘కైఫో-స్కోలియోసిస్’ అనే అతి అరుదైన రూపంలో వంగిపోయిందని గుర్తించారు. అంతేకాకుండా అతడు ముందే ఉన్న అనుమానాస్పదమైన వెన్నెముక టీబీతో కూడిన స్థితిని గేమింగ్ కారణంగా మరింతగా పెంచుకున్నాడు. D11-D12 వెన్నెముకల మధ్య టీబీ సోకడంతో చీము ఏర్పడి వెన్నుపాముపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.
ఇండియన్ స్పైనల్ ఇంజూరీస్ సెంటర్ (ISIC) వైద్యులు అత్యాధునిక “స్పైనల్ నావిగేషన్” సాంకేతికతను వినియోగించి అతడికి సర్జరీ చేశారు. ఇది జీపీఎస్ లాంటి విధంగా పని చేస్తూ వెన్నెముకకు స్క్రూలు అమర్చే పద్ధతిగా ఉంటుంది. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో యువకుడు మళ్లీ నడవగలిగాడు. మూత్రాశయ నియంత్రణ తిరిగి వచ్చింది. వెన్నుపాముపై ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడింది.
ఒకే స్థితిలో గంటల తరబడి కూర్చోవడం, శరీరాన్ని కదలకుండా ఉంచడం వంటి అలవాట్లు ఎముకలపై భయంకరమైన ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన, ఆన్‌లైన్ గేమింగ్ మనిషి జీవితాన్ని ఏ విధంగా చేసిందో చూడొచ్చు.