జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఓ వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో నదిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుల్గాం(Kulgam) జిల్లాలో ఉగ్రవాదులకు సహాయం చేసినట్లు సమాచారం రావడంతో ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే(Imtiyaz Ahmad Magray)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో భాగంగా కుల్గాంలోని టాంగ్మార్గ్లో ఉన్న అడవిలో దాక్కున్న టెర్రిరిస్టులకు తాను ఆహారం, ఆశ్రయంతో పాటు ఇతర సహాయం చేసినట్లు అంగీకరించాడు. అనంతరం ఉగ్రవాదులను బయటకు రప్పించేందుకు సహాయం చేస్తానని నమ్మించాడు.
దీంతో ఆదివారం ఉదయం పోలీసులు, ఆర్మీ బలగాలు అతడిని అక్కడికి తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకునేందుకు ఇంతియాజ్ నదిలో దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతడు కొట్టుకుపోయి మునిగిపోయాడు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపణలు చేశారు. పోలీసులు విచారణకు తీసుకెళ్లిన యువకుడు నదిలో శవమై తేలాడని ఇందులో కుట్రకోణం ఉందని ఆమె విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా విడుదలైన వీడియోలో ఇంతియాజ్ తప్పించుకునేందుకు తనకు తానుగా నీటిలో దూకినట్లు స్పష్టంగా కనపడింది. దీంతో భద్రతా బలగాల తప్పులేదని తేలిపోయింది.