ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్రకు వాతావరణం పెద్ద అడ్డంకిగా మారుతోంది. మే 3 నుంచి ప్రారంభమైన ఈ పవిత్ర యాత్ర ఇంకా పూర్తిగా వేగం అందుకోకముందే హిమాలయాల్లో తీవ్ర చలికి తోడు భారీ వర్షాలు, గాలులు భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ ఇప్పటికే మే 7, 8 తేదీల్లో కొద్దికాలం కూడా యాత్ర చేయడం కష్టమేనని హెచ్చరించింది. ఉత్తరకాశి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే పలు కొండ ప్రాంతాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించబడింది.
ప్రస్తుతం చమోలి జిల్లాలో ఉష్ణోగ్రత మైనస్ 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇది సాధారణం కంటే ఏడు డిగ్రీల తక్కువగా నమోదు కావడం విశేషం. వర్షాలు, మంచు, గాలులతో కూడిన తీవ్ర వాతావరణ మార్పుల నేపథ్యంలో యాత్రికులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గంగోత్రి, యమునోత్రి ధామ్‌లకు చేరుకునే మార్గాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. పలుచోట్ల దట్టమైన మేఘాలు అలముకున్నాయి. పిడుగులు కూడా పడుతున్నాయి.
డెహ్రాడూన్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం, మే 14 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. మే 7, 8 తేదీల్లో వర్షపాతం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున అధికారికంగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. గంగోత్రి, యమునోత్రి ప్రాంతాలకు వెళ్లే భక్తులు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల మధ్య ప్రయాణం చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నదీ తీర ప్రాంతాలు, పగుళ్లు ఏర్పడే ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
గత 24 గంటల్లో ఉత్తరాఖండ్‌లో విస్తృత వర్షపాతం నమోదైంది. జోషిమత్‌లో 90 మిల్లీమీటర్లు, హరిపూర్‌లో 56 మిల్లీమీటర్లు, లక్సర్‌లో 40 మిల్లీమీటర్లు, రోషనాబాద్‌లో 35 మిల్లీమీటర్లు, అల్మోరాలో 12.6 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో భక్తులు, పర్యాటకులు ప్రభుత్వం విడుదల చేస్తున్న వాతావరణ సూచనల్ని పర్యవేక్షిస్తూ ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రయాణానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకొని, ఆరోగ్యానికి భద్రత కలిగే ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. శరీర దృఢత్వం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనుభవం ఉన్నవారే ఈ సమయంలో యాత్ర చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.