కులగణనపై బీజేపీకి జ్ఞానోదయం అయ్యిందని ఏపీపీసీసీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇది రాహుల్ గాంధీ విజయం.. ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే చెందుతుందని ఆమె వెల్లడించారు.
“కులగణనపై బీజేపీకి జ్ఞానోదయం అయ్యింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇది రాహుల్ గాంధీ గారి విజయం. ఈ క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీ గారిది. కులగణన చేయాలి అనేది కాంగ్రెస్ డిమాండ్. సామాజిక న్యాయం కోసం కులగణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాల్సి వస్తే పెంచాలని రాహుల్ అన్నారు. ప్రతి 10 ఏళ్లకు కులగణన చేయాలి. 1951 నుంచి ప్రతి 10 ఏళ్లకు కులగణన జరుగుతుంది. 2011లో చివరి సారి జరిగింది. 2021లో జనగణన జరగాలి. బీజేపీ జనగణనతో పాటు కులగణనపై నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ ఒత్తిడితో ఇప్పుడు తప్పనిసరి అయ్యింది.
కులగణన చేయడం బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకం. బీజేపీ సిద్ధాంతం మత గణన. మతాల మధ్య చిచ్చు పెట్టడం బీజేపీ అజెండా. కులగణన చేస్తే మత గణనకి ఇబ్బంది. ఇందుకే ఇంతకాలం బీజేపీ కులగణనకు ఒప్పుకోలేదు. రాహుల్ పోరాటంతో బీజేపీ దిగి వచ్చింది. కులగణనకి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఆదర్శం. ఈ రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీంతో బీజేపీ దిగి వచ్చింది. రాజకీయ ఒత్తిడితో తలదించుకుంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కులగణనపై టైమ్ బాండ్ కావాలి. రిజర్వేషన్ల పరిమితిపై చర్చ జరగాలి. కులగణన ఫార్మాట్ ఎలా ఉంటుందో బయటపెట్టాలి” అని షర్మిల డిమాండ్ చేశారు.