సింహాచలం(Simhachalam) దేవస్థానం ప్రాంగణంలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ తన ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu)కు అందజేసింది. ఈవో, ఇంజనీరింగ్ సిబ్బంది, పర్యాటక శాఖ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని తన నివేదికలో పేర్కొంది. కూలిన గోడను పూర్తిగా తాత్కాలిక పద్ధతిలో కనీస పునాది కూడా లేకుండా నిర్మించినట్లు కమిటీ గుర్తించింది. చందనోత్సవానికి కేవలం వారం రోజుల ముందు అత్యంత హడావుడిగా ఈ గోడ నిర్మాణం చేపట్టారని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’ పథకంలో భాగంగా నిర్మాణానికి అనుమతులు లభించినప్పటికీ సరైన డిజైన్ లేకుండానే గోడను నిర్మించారని తెలిపింది. భారీ వర్షం కురిసినప్పుడు గోడ వెనుక చేరిన నీరు, బురద బయటకు వెళ్లేందుకు వీలుగా బయటకు పంపే రంధ్రాలు కూడా ఏర్పాటు చేయలేదని చెప్పింది. దీంతో నీటి ఒత్తిడి విపరీతంగా పెరిగి గోడ ఒక్కసారిగా కూలిపోయిందని అభిప్రాయపడింది. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కమిటీ సిఫారసు చేసింది.