జనవరిలో 6.55 శాతం పెరిగిన ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నాటికి 6.44 శాతానికి తగ్గింది. ఒక విధంగా ఇది శుభ వార్తే కానీ, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తీరు చూస్తే గుండె గుభేలుమనడం ఖాయం.అధికారిక లెక్కల ప్రకారం ధరలు కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ విధించిన 6 శాతం పరిమితి కంటే ఇది ఎక్కువేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.ఆందోళనకర విషయమేమిటంటే, ధరలను అదుపు చేయడానికి వడ్డీ రేట్లను పెంచినప్పటికీ, ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. గత 14 నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తే, ఇందులో 12 నెలలు ద్రవ్యోల్బణం రేటు సహన స్థాయికి మించే ఉంటోంది.రిజర్వ్ బ్యాంక్‌లోని ద్రవ్య విధాన కమిటీ ఏప్రిల్‌లో మరోసారి వడ్డీ రేటును పెంచే అవకాశం కూడా ఉందని ఆర్థిక నిపుణులు జోస్యం చెబుతున్నారు. కీలకమంతా నిత్యావసర సరుకుల పెరుగుదల మీదే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు. కూరగాయలు, వంట నూనెల ధరలలో పెద్దగా పెరుగుదల కనిపించనప్పటికీ, ఇతర నిత్యావసర సరుకుల ధరలు మాత్రం సుమారు 5.95 పెరిగిపోయి, సామాన్యుల మీద పెను భారాన్ని మోపుతున్నాయి.వినిమయ ధరల సూచిలో దాదాపు 40 శాతం వీటి ధరల మీదే ఆధారపడి ఉంది.
మాంసం, చేపలు, గుడ్లు, కాయధాన్యాలు, పప్సుధాన్యాలు, విద్యుచ్ఛక్తి, ఇంధనం వంటి వాటి ధరలు రాను రానూ పెరిగిపోతున్నాయి. మున్ముందు ఆహార ధాన్యాల ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వేడి గాలుల కారణంగా పంట దిగుబడి కూడా ఈ ఏడాది గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది చాలదన్నట్టు, వాతావరణ పరిస్థితులకు ఎల్ నీనో పరిస్థితులు కూడా తోడయ్యే అవకాశం ఉందని, ఇదే గనుక జరిగితే, పంట దిగుబడి బాగా తగ్గిపోవడం ఖాయమని వాతావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. రష్యా నుంచి రాయితీ పైన ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, ఆ ధరలకు తగ్గట్టుగా ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ఆయిల్ రేట్లను తగ్గించకపోవడంతో నిత్యావసర సరుకుల ధరల్లో తగ్గుదలేమీ కనిపించడం లేదు. ఇది నిజంగా దురదృష్టకర పరిణామం. పెట్రోల్, డీజిల్ ధరలు కొద్ది కొద్దిగా పెరుగుతూ సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి కానీ, ఆయిల్ కంపెనీలు మాత్రం లాభాలు మూటగట్టుకుంటున్నాయి. ఫలితంగా గత నెల ఆయిల్ ధరలు 9.9 శాతం పెరిగి, ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా, ద్రవ్య సరఫరాకు అడ్డుకట్ట వేయడానికి, ధరల పెరుగుదల అదుపులో ఉండడానికి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతూ ఉంటుంది. అయితే, ఈ చర్య వల్ల పెద్దగా ప్రయోజనం ఉండడం లేదన్నది వాస్తవం. గత ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకూ రిజర్వ్ బ్యాంకు ఆరు పర్యాయాలు వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు వడ్డీ రేటు 6.5 శాతం దగ్గర ఆగింది.కానీ, పరపతి నియంత్రణలు పనిచేస్తున్న దాఖలాలు లేవు. ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్యం వంటి అంతర్జాతీయ కారణాల వల్ల ధరలు పెరుగుతున్న విషయం కొంత వరకూ నిజమే కానీ, స్వదేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా ఇందుకు అవకాశం కల్పిస్తున్న విషయాన్ని విస్మరించకూడదు. ఆర్.బి.ఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య చెప్పిన దాని ప్రకారం, అయిదు ప్రసిద్ధ పారిశ్రామిక వర్గాలు-టాటాలు, రిలయెన్స్, భారతీ టెలికామ్, ఆదిత్య బిర్లా గ్రూప్, ఆదానీ గ్రూప్‌లు-దేశంలో పోటీ అనేదే లేకుండా చేస్తూ, గుత్తాధిపత్యంతో వ్యవహరించడం కూడా ఇందుకు కారణం. ధరలను నిర్ణయించే శక్తి వాటికి మాత్రమే ఉండడంతో, పోటీదారులు వెనుకపట్టు పడడం, ద్రవ్యోల్బణం అడ్డూ ఆపూ లేకుండా పెరగడం జరుగుతోంది. గోధుమ ధర పెరుగుతున్నప్పుడు ప్రభుత్వం కల్పించుకుని దాని ధరను అదుపు చేసింది. ఇతర నిత్యావసర సరుకుల విషయంలోనూ ప్రభుత్వం అదే పంథాను అనుసరించ గలిగితే సామాన్య ప్రజానీకానికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది.