ఈ సంవత్సరం చేప ప్రసాదం(Chepa Prasadam) పంపిణీ చేసే తేదీలు ఖరారయ్యాయి. మృగశీర కార్తె సందర్భంగా జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం అందించనున్నట్లు బత్తిని వంశస్థులు ప్రకటించారు. ఈ సంవత్సరం 5 నుంచి 6 లక్షల మంది వస్తారని ప్రభుత్వానికి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.
ప్రతి ఏడాది మృగశీర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసారం(Chepa Prasadam) పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. బత్తిని కుటుంబ సభ్యులు గత 178 సంవత్సరాలుగా దీనిని కొనసాగిస్తున్నారు. ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఈ చేప ప్రసాదం ఉపశమనం కలిగిస్తుందని విశ్వసిస్తారు. దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు నగరానికి తరలివస్తారు. బత్తిని కుటుంబం ఈ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుంది. చేప ప్రసాదం తీసుకునే వారు నిర్వాహకులు సూచించిన ఆహార నియమాలను పాటించాలి. నాలుగు సంవత్సరాల పాటు వరుసగా దీనిని తీసుకోవాలి.