తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో స్వాతంత్రానికి పూర్వమే రైల్వే, విద్యుత్, టెలిఫోన్ సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. ఒక వ్యక్తిని, పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాళా తీసిన రాష్ట్రంగా చూపడం సరికాదని సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) హితవు పలికారు. ధాన్యం దిగుబడి, జీఎస్డీపీ వృద్ధి రేటు, అత్యధిక బడ్జెట్ స్థాయి వంటి అంశాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు. 2014లోనే తెలంగాణ సొంత పన్నుల ఆదాయం రూ.29 వేల కోట్లని తెలిపారు. ఏటా రూ.5 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం పెరిగేదన్నారు. 2023-24లో రూ.1.19 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పుకొచ్చారు. 2024-25లో రూ.1.25 లక్షల కోట్ల ఆదాయం రాష్ట్రానికి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని సీఎం మాట్లాడాలని సూచించారు. పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలని ఈటల డిమాండ్ చేశారు.