టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీ బాధ్యతలు ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో తాజాగా తెలిపారు. ‘ఆర్సీబీ బోల్డ్ డైరీస్’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కోహ్లీ.. ఒకానొక దశలోతీవ్ర ఒత్తిడికి గురయ్యానని పేర్కొన్నారు. భారత జట్టుకు 7- 8 సంవత్సరాలు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొమ్మిది సంవత్సరాలు సారథిగా వ్యవహరించానన్నారు. అయితే తాను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ తన బ్యాటింగ్ మీద ఎక్కువగా అంచనాలుండేవని.. ఇది తనలో తీవ్రమైన ఒత్తిడికి కారణమైందని వివరించారు. అందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నానని స్పష్టం చేశారు. కెప్టెన్సీ వదిలేశాక స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతున్నానని కోహ్లి వెల్లడించారు.
కాగా 2021 వరల్డ్‌కప్ తర్వాత టీ20ల కెప్టెన్సీకి రాజీనామా చేసిన కోహ్లీ.. ఏడాది అనంతరం టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీని సైతం వదులుకున్నారు. అనంతరం ఐపీఎల్‌లో రాయల్‌ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథ్యం నుంచి కూడా తప్పుకున్నారు. అప్పట్లో కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.