ఓబుళాపురం మైనింగ్ కేసులో తనను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) భావోద్వేగానికి గురయ్యారు. ఈ కేసు విషయంలో పన్నెండున్నరేళ్ల క్రితం కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కానని ఎమోషన్ అయ్యారు. ఏ తప్పూ చేయకపోయినా ఈ కేసులో తన పేరు చేర్చడంపై బాధపడ్డానని తెలిపారు. కానీ న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని సంపూర్ణంగా నమ్మానని.. ఇప్పుడు తనను నిర్దోషిగా ప్రకటించిన న్యాయ వ్యవస్థకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇన్నేళ్లుగా ఎన్నో అవమానాలు పడ్డానని.. ప్రతిపక్ష నేతలు అవినీతి చేశానని, జైలుకు పోతానని హేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తన నియోజకవర్గం ప్రజలు తనపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచారన్నారు.
కాగా ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. 14 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం గాలి జనార్థన్ రెడ్డితో పాటు మరో నలుగురిని దోషులుగా తేలుస్తూ ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ IAS కృపానందంను నిర్దోషులుగా తేల్చింది.