దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది.. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం కూడా ఉన్నాయి. అయితే బోర్డర్ వద్ద యుద్ధ పరిస్థితులు నెలకొంటే.. అంత దూరంలో ఉన్న మన నగరాల్లో మాక్ డ్రిల్ అవసరమా? అనే ప్రశ్నలు కొన్ని వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ సందేహాలన్నింటికీ సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఓ అవగాహన వీడియో విడుదల చేసింది.
ఈ వీడియో ప్రకారం, దేశ రక్షణ అంటే సరిహద్దుల్లో ఉన్న సైనికుల బాధ్యత మాత్రమే కాదు. దేశంలోని ప్రతి పౌరుడి భద్రత కూడా ప్రభుత్వానికి సమానంగా ముఖ్యం. అనూహ్య పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాల్లో ప్రజల్లో అవగాహన కల్పించేందుకే మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
ఈ డ్రిల్‌లో భాగంగా ఎయిర్ రైడ్ అలారం మోగిస్తారు.. ఇది ఒక హెచ్చరికా శబ్దంగా, ఫ్యాక్టరీలలో వినిపించే సైరన్‌లా ఉంటుంది. అలారం వినిపించిన వెంటనే ప్రతిఒక్కరూ తాము ఏ పని చేస్తున్నా వెంటనే దానిని విరమించి.. సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలి. ప్రజలు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, వీధిలో ఉన్నా తక్షణమే స్పందించాలి. వెంటనే ‘బ్లాక్ ఔట్’ ఆపరేషన్ అమలులోకి వస్తుంది. ఇది ఇంట్లో ఉండే అన్ని లైట్లు, ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల వెలుతురు ఆపేయడమే కాదు.. విండోస్ మూసి, కర్టెన్లు వేయాలి.. ఫోన్ల లైట్లూ వెలిగించకూడదు. దీని వల్ల శత్రువు ఎక్కడ వెలుతురు ఉందో గుర్తించి దాడి చేసే ప్రమాదం ఉంది.
బయట వీధి లైట్ల గురించి అయితే ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేస్తుంది. వాలంటీర్లు, అధికారులు చుట్టుపక్కల పరిశీలన చేస్తారు. ఎవరో లైట్ వేసారేమో.. ఎవరో సేఫ్ ప్లేస్‌లో లేరేమో.. అనే విషయాలు గమనిస్తారు. ఈ డ్రిల్ ద్వారా ప్రతి ఇల్లు ఒక అప్రమత్తత కోటలా మారాలి. ఇది భయపెట్టడం కాదు. ఓ అపాయం సంభవించినప్పుడు మనం ఎలా స్పందించాలో తెలుసుకోవడం. చీకట్లో ఉండటం అంటే దాక్కోవడం కాదు. మనందరం ఐక్యతగా, సంఘటితంగా ఉండటం. ఇది మన భద్రత కోసం. మన కుటుంబం కోసం. మన దేశ భద్రత కోసం. కాబట్టి, ఈ మాక్ డ్రిల్స్‌ను ప్రాముఖ్యతగా తీసుకోవాలి. అలర్ట్‌గా ఉండాలి. సైలెంట్‌గా ఉండాలి. సేఫ్‌గా ఉండాలి.